
అమరావతి , 06 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం కీలక మైలురాయిని చేరుకుంది. ఈ పథకం కింద మహిళలు చేసిన ఉచిత బస్సు ప్రయాణాల సంఖ్య 100 కోట్లను దాటినట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. 2026 అక్టోబర్ 5 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు.
2025 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ప్రజా రవాణా ఖర్చు తగ్గించడం మాత్రమే కాకుండా ఉద్యోగాలు, విద్య, వైద్యం, స్వయం ఉపాధి, మార్కెట్లకు వెళ్లడం వంటి అవసరాలకు రవాణా సౌకర్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం పథకం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఉచిత ప్రయాణాల వల్ల మహిళల కుటుంబాలపై పడే రవాణా ఖర్చు తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. అధికారిక అంచనాల ప్రకారం ఇప్పటివరకు మహిళలకు సుమారు రూ.3,500 కోట్ల మేర ప్రయాణ వ్యయం ఆదా అయినట్లు సమాచారం. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.160 కోట్లను ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తోంది. 2026 ఆగస్టు వరకు మొత్తం రూ.2,160 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత ప్రయాణాలు జరగడం ప్రజా రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడం, అవసరమైన రూట్లలో అదనపు సర్వీసులు నిర్వహించడం, ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి పరిహారం అందించడం వంటి అంశాలు పథకం అమలులో కీలకంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్