
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మరింత సులభతరం చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన CII 31వ పార్ట్నర్షిప్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలను ఆన్లైన్, రియల్టైమ్ విధానంలో అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వ్యవస్థను రూపొందించనున్నట్లు తెలిపారు.
పారిశ్రామికవేత్తలకు అవసరం లేని విధానపరమైన ప్రక్రియలను తగ్గిస్తామని సీఎం చెప్పారు.
ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో విధానాన్ని ఉపయోగించే ఆలోచనను వివరించారు. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే ప్రోత్సాహకాలు నిర్ణీత ప్రక్రియ పూర్తయిన తర్వాత నేరుగా ఆన్లైన్ ద్వారా సంబంధిత సంస్థల ఖాతాల్లోకి చేరే విధంగా వ్యవస్థను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
ఇదే సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కోసం భారీ పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులను కేవలం ముడి సరుకుగా కాకుండా ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు పంపే విధానాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కృష్ణా–గోదావరి ప్రాంతాల అనుసంధానం, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా రాష్ట్ర వ్యూహంలో భాగమని సీఎం వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్