
కామారెడ్డి, 08 అక్టోబర్ (హి.స.)
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన కామారెడ్డి జిల్లా కారేగావ్ గ్రామ రైతులు గురువారం రోడ్డెక్కారు. రోజుకు కేవలం రెండు, మూడు గంటలే విద్యుత్ ఇస్తున్నారని, వచ్చిన కరెంట్ కూడా లో-వోల్టేజ్తో మోటార్లు పనిచేయడం లేదని ఆరోపిస్తూ స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట, కారేగావ్-గోధుమగావ్ ప్రధాన రహదారిపై గంటల తరబడి బైఠాయించి నిరసన తెలిపారు. సమయానికి నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు