
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి రాజకీయంగా కీలకంగా మారుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చబోదని మంత్రి నారా లోకేశ్ తాజాగా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై నిర్ణయం వెలువడిన తర్వాత ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి స్పష్టత వస్తుందని, అక్టోబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ న్యాయపరమైన పరిణామం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై అనిశ్చితి ఏర్పడింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది.
లోకేశ్ వ్యాఖ్యల ప్రకారం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల రొటేషన్ కూడా కీలక అంశంగా మారనుంది. ఒకసారి ఒక వర్గానికి కేటాయించిన స్థానాలను తదుపరి ఎన్నికల్లో ఇతర వర్గాలకు మార్చే ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్ రొటేషన్, ఎన్నికల షెడ్యూల్ వంటి అంశాలపై రాజకీయ పార్టీలు ఇప్పటికే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయగలవు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా సున్నితమైనది కావడంతో సుప్రీంకోర్టు తీర్పుపై అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్