
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)
పోలవరం ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు మరింత వేగం పెంచుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) సీఈఓ సంజీవ్ వోహ్రా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
ప్రస్తుతం ప్రాజెక్టు పనులకు అవసరమైన మట్టి, రాయి, ఇసుక, సిమెంట్ వంటి కీలక నిర్మాణ సామగ్రిని తగినంతగా ముందుగానే నిల్వ చేసుకోవాలని ఆయన అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించారు.
వర్షాభావ పరిస్థితుల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నందున సామగ్రి కొరత వల్ల పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్యాప్–1, గ్యాప్–2, జీ–హిల్, జీ–డాష్ హిల్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన పీపీఏ అధికారులు నిర్మాణ వేగం, నాణ్యతపై సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం నిధుల విడుదల దశలవారీగా జరుగుతోందని పీపీఏ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగం పెంచాలని సూచించారు. ఈ నెల చివర్లో అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అప్పటికి నిర్దేశిత పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్