
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో జరిపిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలక అంశాన్ని కేంద్రం ముందుంచారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం అమలులో లేకుండా నిలిపివేసిన ‘స్టాప్ వర్క్’ ఆర్డర్ను పూర్తిగా, శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని సీఎం కోరారు. ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని రక్షణ కరకట్టల నిర్మాణం విషయంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండటంతో గతంలో స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ అయింది. ప్రస్తుతం ఆ ఆదేశం అమలులో లేకపోయినా, భవిష్యత్లో ఎలాంటి న్యాయపరమైన లేదా పరిపాలనా ఆటంకాలు రాకుండా దాన్ని శాశ్వతంగా తొలగించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.
ఈ సమస్యను మూడు రాష్ట్రాల మధ్య పరస్పర చర్చలతో పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా చంద్రబాబు ప్రతిపాదించారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ అంశాలను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన సూచించారు. మూడు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరస్పర సహకారం, సమన్వయం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యను పరిష్కరించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, తదుపరి గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. అదే సమయంలో నిర్వాసితుల పునరావాసం, పునరావాస పరిహారం పనులకు కూడా నిర్మాణ పనులతో సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. 41.15 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పునరావాస పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. 45.72 మీటర్ల స్థాయికి నీటిని నిల్వ చేయడానికి అవసరమైన తదుపరి చర్యలపైనా చర్చ జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్