
రాజన్న సిరిసిల్ల, 08 అక్టోబర్ (హి.స.)
టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేలా వైద్య సిబ్బంది పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో సర్పంచులు, వైద్య సిబ్బందికి నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీబీ లక్షణాలు, వైద్య పరీక్షలు, మందులు, పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ఎంపికైన 20 గ్రామ పంచాయతీల సర్పంచులు, వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించి.. అభినందించారు. మిగతా వైద్యులు, సిబ్బంది వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. 20 మంది క్షయ బాధితులకు పోషకాహారం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వైద్య సిబ్బంది పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని పిలుపు నిచ్చారు. టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..