
వికారాబాద్, 08 అక్టోబర్ (హి.స.)
కొడంగల్ మండలం ఎర్రన్పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ కళాశాల నిర్మాణ పనులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గురువారం పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరుతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. కళాశాల నిర్మాణంలో పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, తదుపరి చేపట్టాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కళాశాలను త్వరితగతిన విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిపాలనా భవనం తదితర మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..