JNTU హైదరాబాద్ వీసీపై మహిళా అధ్యాపకుల పోలీస్ ఫిర్యాదు.. ఆరోపణలతో కలకలం
హైదరాబాద్లోని జేఎన్టీయూ పరిధిలో వీసీపై మహిళా అధ్యాపకులు చేసిన ఫిర్యాదు గురువారం చర్చనీయాంశమైంది.
JNTU


హైదరాబాద్ , 08 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లోని జేఎన్టీయూ పరిధిలో వీసీపై మహిళా అధ్యాపకులు చేసిన ఫిర్యాదు గురువారం చర్చనీయాంశమైంది. జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ. కిషన్కుమార్ రెడ్డిపై కొందరు మహిళా అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమావేశం సందర్భంగా తమపై అసభ్యకరమైన, లింగ వివక్షతో కూడిన, బెదిరింపులకు దారితీసే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం, అక్టోబర్ 6న ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మహిళా అధ్యాపకులు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకుని వీసీని కలిసేందుకు వెళ్లారు. తమ కళాశాలలో అక్టోబర్ 30న జరగనున్న కార్యక్రమానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు వెళ్లినట్లు వారు తెలిపారు. అయితే సమావేశం సందర్భంగా వీసీ తమతో దురుసుగా, అవమానకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, మహిళలు సంస్థ అభివృద్ధికి అడ్డంకిగా ఉంటారని అన్నారని వారు ఆరోపించారు. మహిళలు విద్యా, వృత్తి రంగాల్లో కాకుండా ఇంటికే పరిమితం కావాలనే భావన వ్యక్తం చేశారని కూడా ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో తాము తీవ్రంగా అవమానితులమై, భయాందోళనకు గురయ్యామని వారు పోలీసులకు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande