
ఢిల్లీ , 11 నవంబర్ (హి.స.)
దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ మెరుగైన పారిశుద్ధ్య ప్రమాణాలు పాటిస్తున్న నగరాలను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డుల ప్రదానోత్సవం నేడు ఢిల్లీలో జరగనుంది. విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆమె చేతుల మీదుగా ఉత్తమ పనితీరు కనబరిచిన నగరాలు, స్థానిక సంస్థలకు జాతీయ స్థాయి పురస్కారాలు అందజేయనున్నారు.
పరిశుభ్రత నిర్వహణ, చెత్త సేకరణ, వ్యర్థాల శుద్ధి, బహిరంగ ప్రదేశాల పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులకు నగరాలను ఎంపిక చేస్తారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఈ ఏడాది అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రాధాన్యం లభించనుంది. రాష్ట్రం తరఫున మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి హాజరై పురస్కారాన్ని అందుకోనున్నారు. పట్టణాల పరిశుభ్రతలో మెరుగైన ఫలితాలు సాధించిన నగరాలకు ఈ అవార్డులు మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్