
జమ్మూకాశ్మీర్ , 11 నవంబర్ (హి.స.)
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి అరాచకానికి పాల్పడ్డారు. కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పుల తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్గామ్ జిల్లాలోని మీర్బజార్ ప్రాంతం సమీపంలో గల అఖ్రాన్ వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది నకా (తనిఖీ కేంద్రం) వద్ద విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు అకస్మాత్తుగా భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మెరుపు దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కాల్పులకు పాల్పడిన వెంటనే దుండగులు అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. అప్రమత్తమైన జవాన్లు ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. స్థానిక భద్రతా బలగాలు వెంటనే స్పందించి, గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స నిమిత్తం అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఈ ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన సైన్యం మరియు పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి (కార్డన్) తీసుకున్నారు. పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసి, ముష్కరుల జాడ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi