
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదుతో పాటు ఏవైనా సవరణలు, అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయడానికి డిసెంబర్ 11వ తేదీ వరకు గడువు కల్పించారు.
కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే ఇప్పటికే జాబితాలో ఉన్న ఓటర్లు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా మరణించిన వారి లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడానికి కూడా నిర్ణీత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రజలు తమ సమీపంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బూత్ స్థాయి అధికారులను (BLO) సంప్రదించి లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ సవరణలు చేసుకోవచ్చు. డిసెంబర్ 11 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi