
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)
కేంద్ర ప్రభుత్వ అధికారుల ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు నిబంధనలలో కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం (Department of Expenditure) నేడు (నవంబర్ 12) కీలక మార్పులను ప్రకటించింది.గతంలో 2023 జులైలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరిస్తూ విడుదల చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం, అర్హులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు కేటాయించే ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల గరిష్ట ధర పరిమితిని గణనీయంగా పెంచారు. 7వ వేతన సంఘం ప్రకారం పే లెవల్-12 మరియు ఆపై స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ఇకపై రూ.1.50 లక్షల వరకు (పన్నులు అదనం) విలువైన ల్యాప్టాప్లు, నోట్బుక్లు లేదా అల్ట్రాబుక్లను కొనుగోలు చేసి ఇచ్చేందుకు మంత్రిత్వ శాఖలకు అనుమతి లభించింది. ఒకవేళ ఆ పరికరంలో 40 శాతానికి పైగా మేక్ ఇన్ ఇండియా (Make in India) విడిభాగాలు ఉన్నట్లయితే, ఆ ధర పరిమితిని ఏకంగా రూ.1.80 లక్షల వరకు (పన్నులు అదనం) పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పరిమితులు వరుసగా రూ. 1 లక్ష మరియు రూ.1.30 లక్షలుగా ఉండేవి.అంతేకాకుండా, అధికారిక విధుల కోసం పొందిన ఈ పరికరాలను నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా ఉపయోగించిన తర్వాత, సదరు అధికారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే వాటిని వ్యక్తిగతంగా తమ వద్దే ఉంచుకునే (Personal Retention) వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.అయితే, పరికరంలోని ప్రభుత్వ సమాచారం మరియు డేటా భద్రతకు ఆయా అధికారులే పూర్తిగా వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.పాత నిబంధనల్లో ఉన్న మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశాన్ని తాజా జాబితా నుంచి మినహాయించడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi