తమిళనాడులో భారీ దోపిడీ: తనిష్క్ షోరూమ్లో రూ. 50 కోట్ల బంగారు నగలు అపహరణ
తమిళనాడులో భారీ దోపిడీ: తనిష్క్ షోరూమ్లో రూ. 50 కోట్ల బంగారు నగలు అపహరణ
Gold


మదురై, 12 నవంబర్ (హి.స.)

తమిళనాడులోని మదురై నగరంలో భారీ దోపిడీ కలకలం రేపింది. మదురైలోని పలంగనాథం (కలవాసల్ సమీపంలో) ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆభరణాల విక్రయ కేంద్రం 'తనిష్క్' (Tanishq) షోరూమ్‌లో గుర్తుతెలియని దుండగులు సుమారు రూ.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు.ఈ నూతన షోరూమ్‌ను ప్రారంభించి కేవలం పదిహేను రోజులు కూడా కాకముందే ఈ భారీ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ రోజు (నవంబర్ 12) తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన, ఉదయం సిబ్బంది షోరూమ్ తెరిచిన తర్వాత వెలుగులోకి వచ్చింది.షోరూమ్‌లోని ప్రధాన ద్వారాలు లేదా గోడలు ఎక్కడా పగలగొట్టకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, భవనంలో ఇంకా లిఫ్ట్ మరియు ఇంటీరియర్ పనులు అసంపూర్తిగా ఉండటాన్ని అదనుగా చేసుకున్న దొంగలు, భవనం పైభాగం నుంచి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ షాఫ్ట్ మార్గం ద్వారా మొదటి అంతస్తులోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మాస్క్ ధరించిన నిందితుడు ట్రాలీ బ్యాగ్‌తో లోపలికి వెళ్లి, ప్రదర్శనకు ఉంచిన కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలను నింపుకుని అదే మార్గంలో పరారైన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సమాచారం అందుకున్న మదురై నగర పోలీస్ కమిషనర్ ఎస్.రాజేంద్రన్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.నిందితులను పట్టుకునేందుకు అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు.షోరూమ్‌లో భద్రతా లోపాలపై పూర్తి అవగాహన ఉన్నవారే ఈ పనికి పాల్పడి ఉంటారనే కోణంలో, షోరూమ్ సిబ్బందితో పాటు అక్కడ పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లను పోలీసులు విచారిస్తున్నారు.సమీప రహదారులు, పెట్రోల్ బంకుల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande