
ఢిల్లీ, 18 నవంబర్ (హి.స.)
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల కోసమే ప్రత్యేకంగా కేటాయించిన (రిజర్వ్ చేసిన) చికిత్సా ప్యాకేజీల సంఖ్యను ప్రస్తుతమున్న 23 నుంచి ఏకంగా 112కు పెంచాలని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (NHA) యోచిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, సామాన్య ప్రజలకు సర్కారీ దవాఖానాల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకం కింద 23 రకాల చికిత్సా ప్యాకేజీలు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. అంటే ఈ చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్‌లు ప్రైవేట్ ఆసుపత్రులకు వర్తించవు. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే మరో 89 అదనపు ప్యాకేజీలు ప్రభుత్వ ఆసుపత్రుల జాబితాలోకి చేరనున్నాయి. దీనివల్ల సాధారణ శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవల కోసం రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూడకుండా ప్రభుత్వ ఆసుపత్రులకే వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఈ మార్పు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వచ్చే నిధులు గణనీయంగా పెరుగుతాయి. ఆ నిధులతో ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకోవడం మరింత సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్ని చికిత్సల పేరుతో జరుగుతున్న అనవసరపు క్లెయిమ్‌లకు అడ్డుకట్ట వేయడానికి కూడా ఈ నిర్ణయం దోహదపడనుంది. త్వరలోనే ఈ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi