ఆజం ఖాన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. మధ్యంతర బెయిల్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ!
ఆజం ఖాన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. మధ్యంతర బెయిల్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ!
Supreme Court HD


హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత మహ్మద్ ఆజం ఖాన్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆజం ఖాన్‌కు అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై తక్షణమే స్టే విధించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై నవంబర్ 19వ తేదీ గురువారం విచారణ జరుపుతామని స్పష్టం చేసిన ధర్మాసనం, అప్పటివరకు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు అమలులోనే ఉంటాయని తేల్చిచెప్పింది.

ఆజం ఖాన్ జైలు నుంచి బయటకు రాకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతూ ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి. రాజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అత్యవసరంగా ప్రస్తావించారు. కేసు మొదటి విచారణలోనే తమకు పూర్తిస్థాయి వివరణ ఇచ్చే అవకాశం లేకుండానే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని ఆయన వాదించారు. అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా అందజేయడానికి ప్రయత్నించగా ఆజం ఖాన్ నిరాకరించారని ఈడీ పేర్కొంది. అయితే ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం, ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వస్తే ఆకాశమేమీ ఊడిపడదని వ్యాఖ్యానిస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

మౌలానా మహ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్, జౌహర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 31న ఈడీ ఆజం ఖాన్‌ను అరెస్టు చేసింది. అంతకుముందే రాంపూర్ జిల్లా జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1), పీఎంఎల్ఏ సెక్షన్ 19 నిబంధనలను ఈడీ సరిగ్గా పాటించలేదని ప్రాథమికంగా అభిప్రాయపడిన అలహాబాద్ హైకోర్టు నవంబర్ 17న ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఈడీకి వారం రోజుల గడువు ఇచ్చిన హైకోర్టు, తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande