కుల్గాం ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. ముగిసిన లతీఫ్ భట్ ఉగ్ర ప్రస్థానం!
కుల్గాం ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. ముగిసిన లతీఫ్ భట్ ఉగ్ర ప్రస్థానం!
kashir


జమ్మూకశ్మీర్‌, 18 నవంబర్ (హి.స.)

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో లష్కరే తొయిబా మోస్ట్ వాంటెడ్ ‘కేటగిరీ-ఎ’ ఉగ్రవాది లతీఫ్ భట్ (23) హతమయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ మసీదులో నక్కిన అతడిని ప్రాణాలతో పట్టుకునేందుకు భద్రతా బలగాలు చివరి వరకు ప్రయత్నించాయి. వీడియో కాల్ ద్వారా లొంగిపోవాలని అవకాశం ఇచ్చినప్పటికీ, లతీఫ్ అందుకు నిరాకరించి బలగాలపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మసీదుకు ఏమాత్రం నష్టం కలగకుండా బలగాలు అత్యంత సంయమనంతో ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయడం విశేషం. కశ్మీర్ లోయలో క్రియాశీలంగా ఉన్న చివరి స్థానిక ఉగ్రవాది ఇతడేనని భద్రతా వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాద బాట పట్టిన సరిగ్గా ఏడాదికే లతీఫ్ భట్ కథ ముగియడం గమనార్హం. 2025 నవంబర్ 18న లష్కరే తొయిబాలో చేరిన అతడు, సరిగ్గా ఏడాది తర్వాత భద్రతా దళాల తూటాలకు బలయ్యాడు. కుల్గాం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మధ్యలోనే ఆపేసి గతంలో వడ్రంగిగా పనిచేసిన లతీఫ్, ఆ తర్వాత దక్షిణ కశ్మీర్‌లో లష్కర్ స్థానిక కమాండర్‌గా ఎదిగాడు. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్), కశ్మీర్ రివల్యూషనరీ ఆర్మీ (కేఆర్ఏ) వంటి ఉగ్ర సంస్థలతోనూ ఇతడు సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు.

దక్షిణ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన పలు ఉగ్రదాడులకు లతీఫ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. జులై 22న అనంత్‌నాగ్‌లో ఓ పోలీస్ అధికారి హత్య, ఆగస్టు 1న కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్య కేసుల్లో ఇతడి ప్రమేయం ఉంది. నవంబర్ 11న కుల్గాంలోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై దాడి చేసి ముగ్గురు జవాన్లను గాయపరిచాడు. ఈ నెల 16న జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇతడికి ఆశ్రయం కల్పించిన సహచరుడు ఉమర్ నిసార్ దార్ మరణించగా, అప్పుడు లతీఫ్ తృటిలో తప్పించుకున్నాడు. చివరకు పక్కా నిఘా సమాచారంతో బలగాలు అతడిని మట్టుబెట్టాయి. పాకిస్థాన్‌లో ఉన్న అతడి హ్యాండ్లర్లు, ఆయుధాల సరఫరా నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande