నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసు: 14 మంది నిందితులపై అభియోగాల నమోదుకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం!
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసు: 14 మంది నిందితులపై అభియోగాల నమోదుకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం!
neet


ఢిల్లీ , 18 నవంబర్ (హి.స.)

ఢిల్లీ సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 14 మంది నిందితులపై అభియోగాలు (Framing of charges) నమోదు చేయాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించి నవంబర్ 25 నుంచి ప్రతిరోజూ (డే-టు-డే) విచారణ జరగాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పష్టం చేసింది.

భారతీయ న్యాయ సంహిత (BNS), నిరోధక చట్టం (Prevention of Corruption Act), అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెర్ మీన్స్) యాక్ట్-2024 లోని పలు సెక్షన్ల కింద కోర్టు అభియోగాలు ఖరారు చేసింది.

నిందితుల వివరాలు:

ఈ కేసులో యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభమ్ ఖైర్నార్, ధనంజయ్ లోఖండే, ప్రహ్లాద్ కులకర్ణి, తేజస్ హర్షద్ కుమార్, డాక్టర్ మనోజ్ షిరురే, శివరాజ్ రఘునాథ్ మోటెగాంకర్, మనీషా వాఘ్మరే, మనీషా మంధారే, మనీషా సంజయ్ హవాల్దార్, శేష్రావు బజ్రంగ్ సూర్యవంశీ తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి. సీబీఐ మరియు నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు అక్టోబర్ 29నే తీర్పును రిజర్వ్ చేసింది.

సీబీఐ దర్యాప్తు వివరాలు:

నీట్-యూజీ పరీక్షా పత్రాల లీకేజీ, అవకతవకలపై వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో మే 12న సీబీఐ ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే రంగంలోకి దిగిన 72 మంది సీబీఐ అధికారులు, 8 మంది సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఏకంగా 92 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మే 13నే ఈ కేసులో తొలి అరెస్టు నమోదు కాగా, పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు ఎలా లీకయ్యాయి, ఎవరెవరికి చేరవేశారనే కోణంలో సీబీఐ పక్కా ఆధారాలు సేకరించింది. ఇప్పుడు కోర్టు ఛార్జెష్ ఖరారు చేయడంతో త్వరలోనే ఈ కేసు విచారణ తుది దశకు చేరుకోనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande