
ఢిల్లీ, 18 నవంబర్ (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించి 1980 నాటి ఓటర్ జాబితా నమోదు వివాదంలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె భారతీయ పౌరసత్వం పొందడానికి ముందే, అంటే 1980లో ఓటర్ జాబితాలో పేరు చేర్చుకున్నారనే ఆరోపణలపై దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు.. ఈ విషయమై నివేదిక (Action Taken Report - ATR) సమర్పించాలని ఢిల్లీ పోలీసులను బుధవారం ఆదేశించింది.
అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వినోద్ జోషి ఈ కేసుకు సంబంధించి పోలీసుల రిపోర్టును కోరుతూ తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేశారు.
అడ్వకేట్ వికాస్ త్రిపాఠి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. విచారణలో భాగంగా 1980, 1981, 1983 సంవత్సరాలకు సంబంధించిన ధృవీకరించబడిన ఓటర్ జాబితా కాపీలను ఆయన కోర్టుకు సమర్పించారు. సోనియా గాంధీ 1983 ఏప్రిల్‌లోనే భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ అంతకంటే ముందే 1980 నాటి ఓటర్ జాబితాలో ఆమె పేరు ఎలా చేరిందని ఫిర్యాదుదారు ప్రశ్నించారు. 1982లో ఆమె పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించి, మళ్లీ 1983లో పునరుద్ధరించారని ఆరోపించారు. పౌరసత్వం లేని సమయంలో ఓటర్ జాబితాలో పేరు చేర్చుకోవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించి ఉంటారని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.
కాగా, ఈ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు గతంలో సెప్టెంబర్ 11, 2025న కొట్టేసిందని, అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేయగా సెషన్స్ కోర్టు దానిని తిరిగి పరిశీలించాలని ఆదేశించిందని తెలిపారు. సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకే ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసరును కొత్తగా విచారిస్తూ పోలీసుల నుంచి ఏటీఆర్ కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi