ప్రపంచ శౌచాలయ దినోత్సవం సందర్భంగా 'స్వచ్ఛ్ శౌచాలయ-గౌరవప్రదమైన భవిష్యత్తు' ప్రచారాన్ని ప్రారంభించిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ
ప్రపంచ శౌచాలయ దినోత్సవం సందర్భంగా 'స్వచ్ఛ్ శౌచాలయ-గౌరవప్రదమైన భవిష్యత్తు' ప్రచారాన్ని ప్రారంభించిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ
The Ministry of Jal Shakti launched the ‘Swachh Shauchalaya – Dignified Future’ campaign.


న్యూఢిల్లీ, నవంబర్ 20 (హి.స): గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ, సంస్థాగత మరుగుదొడ్ల నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ప్రపంచ శౌచాలయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 19 నుంచి ‘స్వచ్ఛ్ శౌచాలయ - డిగ్నిఫైడ్ ఫ్యూచర్’ ప్రచారాన్ని మొదలుపెట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద దేశవ్యాప్తంగా జరిగే ఈ ప్రచారం డిసెంబర్ వరకు సాగి, మానవ హక్కుల దినోత్సవం నాడు ముగుస్తుంది.

జల్ శక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సంయుక్త కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) జాతీయ మిషన్ డైరెక్టర్ ఐశ్వర్య సింగ్ నవంబర్ 19న ఈ ప్రచారాన్ని, దాని రిపోర్టింగ్ మాడ్యూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మాడ్యూల్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పురోగతిని నివేదించవచ్చు. మిషన్ ప్రగతిపై అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం, దాదాపు 89.9 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ (ODF Plus) మోడల్ హోదాను సాధించాయి.

2026 ప్రపంచ టాయిలెట్ దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి ‘సురక్షితమైన మరుగుదొడ్లు, సమాన భవిష్యత్తు’ అనే థీమ్‌ను తీసుకుంది. ఇది పారిశుద్ధ్యం, లింగ సమానత్వం మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. దీనికి తగ్గట్టుగా మహిళలు, కౌమార బాలికలు, దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్రామీణ పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరచడంపై ఈ ప్రచారం పనిచేస్తుంది.

ఈ ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్‌లతో పాటు స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాల్లోని మరుగుదొడ్ల స్థితిని పరిశీలిస్తారు. అవసరమైన చోట మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ పనులు చేస్తారు. ప్రజలు కూడా తమ సొంత ఇంటి మరుగుదొడ్లను బాగు చేసుకుని, శుభ్రంగా ఉంచుకునేలా ప్రోత్సహిస్తారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా, వీలైన చోట సింగిల్-పిట్ మరుగుదొడ్లను ట్విన్-పిట్ మరుగుదొడ్లుగా, సోక్ పిట్ లేని సెప్టిక్ ట్యాంకులను సోక్ పిట్ ఉన్న సెప్టిక్ ట్యాంకులుగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తారు.

మల వ్యర్థాల నిర్వహణ కోసం మెషిన్ల ద్వారా బురద తొలగించే సదుపాయాలు ఎంతవరకు అవసరం, ఎక్కడ అందుబాటులో ఉన్నాయో అంచనా వేయడం కూడా ఇందులో ఒక భాగం. కమ్యూనిటీ, సంస్థాగత మరుగుదొడ్ల నిర్వహణను బలోపేతం చేస్తూ వాటిని శుభ్రంగా, అందంగా, సులభంగా వాడుకునేలా తీర్చిదిద్దుతారు. గోడలపై బొమ్మలు వేయడం, సైన్ బోర్డులు పెట్టడం, పరిసరాలను మెరుగుపరచడం వంటి వాటినీ ప్రోత్సహిస్తారు. బహిరంగ మలవిసర్జన లేని (ODF) స్థితిని అలాగే కొనసాగించేందుకు గ్రామాల్లో అవగాహన, ప్రవర్తన మార్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దీనితో పాటు గ్రామాలు, గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సేవా అంచనా స్థితిని సమీక్షించి, నవంబర్ 30 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత, సబ్బుతో చేతులు కడుక్కోవడం, మల వ్యర్థాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 పాటించడం, చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయడం వంటి అంశాలపై కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటకకు చెందిన స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) బృందాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సమర్పించాయి. స్కూళ్లలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండేలా, పారిశుద్ధ్య తనిఖీలు చేసేలా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, సంబంధిత శాఖలతో కలిసి పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల బృందాలకు ఐశ్వర్య సింగ్ సూచించారు.

పర్యాటక ప్రాంతాలతో సహా జనాలు ఎక్కువగా వచ్చే చోట్ల శుభ్రంగా ఉండి, పనిచేసే కమ్యూనిటీ మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.

స్కూలు పిల్లల్లో పారిశుద్ధ్యం, శుభ్రతపై అవగాహన పెంచడంతో పాటు సమాజం నుంచి ఎక్కువ భాగస్వామ్యం తీసుకురావడమే ఈ ప్రచారం లక్ష్యం. వివిధ వర్గాలను ఇందులో భాగస్వాములను చేస్తూ, ప్రజా భాగస్వామ్యంతో పూర్తిస్థాయి పారిశుద్ధ్యం సాధించేలా కృషి చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వ శాఖ కోరింది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande