రక్త సంబంధీకుల మధ్య వివాహాలను నియంత్రించే చట్టంపై కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు
రక్త సంబంధీకుల మధ్య వివాహాలను నియంత్రించే చట్టంపై కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు
File


న్యూఢిల్లీ, నవంబర్ 20 (హి.స): దగ్గరి బంధువుల మధ్య వివాహాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడం లేదా ప్రత్యామ్నాయంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి పరిమిత నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ నేరుగా ఇలాంటి వివాహాలను నిషేధించలేదని, అయితే ఈ అంశంపై విస్తృత ప్రజా అవగాహన కల్పించాల్సిన అవసరంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించగలదని ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా, ఆచారాలు మరియు వివాహాలకు సంబంధించిన సామాజిక సంస్కరణలపై చట్టాలు చేయడం పూర్తిగా పార్లమెంటు పరిధిలోని అంశమని కోర్టు అభిప్రాయపడింది. చట్టం రూపొందించాలని న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని ఆదేశించలేదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయడం సముచితమేనా, లేక పాఠశాల, కళాశాల పాఠ్యాంశాలు మరియు ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా జన్యుపరమైన ముప్పులపై ప్రజలను చైతన్యపరచవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.

20 ఏళ్ల న్యాయ విద్యార్థిని చార్వి ఎస్. దాఖలు చేసిన పిటిషన్‌లో తన వ్యక్తిగత అనుభవాలు, వైద్య అధ్యయనాలను ప్రస్తావిస్తూ, దగ్గరి బంధువుల మధ్య వివాహాల వల్ల పుట్టే పిల్లల్లో తీవ్రమైన జన్యుపరమైన లోపాలు, పుట్టుకతో వచ్చే వ్యాధుల ముప్పు పెరుగుతుందని వాదించారు. స్థానిక ఆచారాల ఆధారంగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి వివాహాలకు అనుమతినిచ్చే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టంలోని నిబంధనలపైనా పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఇలాంటి వివాహాలు సుమారు 11 శాతం ఉండగా, దక్షిణ భారతదేశంలో ఏకంగా 28 శాతం వరకు ఉన్నాయి. ఇప్పటికే జరిగిన వివాహాల చెల్లుబాటును ప్రశ్నించడం తమ ఉద్దేశం కాదని, భవిష్యత్ తరాలను ఆరోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు అవగాహన పెంచడమే తమ లక్ష్యమని పిటిషనర్ స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande