సమాజ్ వాదీ పార్టీ మతతత్వ, బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తోంది...బీజేపీ ఆరోపణ
సమాజ్ వాదీ పార్టీ మతతత్వ, బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తోంది...బీజేపీ ఆరోపణ
Gaurav Bhatia


న్యూఢిల్లీ, నవంబర్ 20 (హి.స): సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆ పార్టీ నేత ఆజం ఖాన్ మతపరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు కేవలం బెయిల్ మాత్రమే లభించిందని, ఇంకా విచారణ ఎదుర్కొంటున్నానే తప్ప నిర్దోషిగా విడుదల కాలేదన్న విషయాన్ని ఆజం ఖాన్ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన గౌరవ్ భాటియా, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా, గతంలో అఖిలేష్ యాదవ్, ఆజం ఖాన్ హయాంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. బుజ్జగింపు, మత రాజకీయాలే ఏకైక లక్ష్యంగా పనిచేసిన వారు శ్మశానవాటికల ప్రహరీ గోడలకు, హజ్ హౌస్ నిర్మాణానికి ప్రజాధనాన్ని ఖర్చు చేశారని విమర్శించారు.

ఆజం ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఉత్తరప్రదేశ్‌లో సింహం లాంటి ధైర్యసాహసాలు ఎవరికైనా ఉన్నాయంటే అది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కేనని గౌరవ్ భాటియా అన్నారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande