గోపాల్పూర్ సమీపంలో తీరం దాటనున్న తుఫాను: ఒడిశా తీరంలో భారీ వర్షాలు.. 69 రైళ్లు రద్దు, రీషెడ్యూల్!
గోపాల్పూర్ సమీపంలో తీరం దాటనున్న తుఫాను: ఒడిశా తీరంలో భారీ వర్షాలు.. 69 రైళ్లు రద్దు, రీషెడ్యూల్!
train


భువనేశ్వర్, 20 నవంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావంతో ఒడిశా తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ఒడిశాలోని గోపాల్‌పూర్ (Gopalpur) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంత జిల్లాలను అధికారులు హై అలర్ట్‌లో ఉంచారు.

తుఫాను ముప్పు మరియు భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే (East Coast Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో ప్రయాణించే మొత్తం 69 రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరోవైపు గంజాం, గజపతి, పూరీ, ఖుర్దా, జగత్సింగ్‌పూర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, తుఫాను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఒడ్రాఫ్ (ODRAF), అగ్నిమాపక దళాలను రంగంలోకి దించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande