
న్యూఢిల్లీ, , 20 నవంబర్ (హి.స.)
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా (LeT) కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ హతమవడంతో, గత 35 ఏళ్లలో తొలిసారిగా కశ్మీర్ లోయ స్థానిక ఉగ్రవాదుల (భారత్‌లో పుట్టిన ఉగ్రవాదులు) నుంచి పూర్తిగా విముక్తి పొందిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటంలో ఇదొక అతిపెద్ద మైలురాయి అని ఆయన అభివర్ణించారు.
నవంబర్ 11న అఖ్రాన్లోని సీఆర్పీఎఫ్ (CRPF) పోస్టుపై జరిగిన దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న లతీఫ్ భట్‌పై రూ. 15 లక్షల రివార్డు ఉంది. బుధవారం తెల్లవారుజామున కుల్గాంలోని ఒక మసీదులో నక్కిన భట్‌ను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పోలీసులు కోరినప్పటికీ అతడు కాల్పులకు తెగబడటంతో సైన్యం ఎదురుకాల్పులు జరిపి హతమార్చింది. మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యంత సంయమనంతో 7 గంటల పాటు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులను, సైన్యాన్ని, సీఆర్పీఎఫ్, నిఘా సంస్థలను అమిత్ షా అభినందించారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌ను అనుసంధానిస్తూ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఒకే తరహా ఏకీకృత వ్యూహాన్ని (Uniform Counter-Terror Strategy) అమలు చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. కేవలం ఉగ్రవాదులను అంతం చేయడమే కాకుండా, వారికి అందుతున్న ఆర్థిక సాయం, మద్దతు వ్యవస్థలను పూర్తిగా కూల్చివేయాలని ఆయన స్పష్టం చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నెట్‌వర్క్‌పై 11 రాష్ట్రాల్లో ఏకకాలంలో చేసిన దాడులు, అలాగే షహజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన 40కి పైగా మాడ్యూళ్లను ఛేదించి 271 మందిని అరెస్టు చేయడం కేంద్ర-రాష్ట్ర ఏజెన్సీల సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, డ్రగ్స్ ముఠాల మధ్య ఉన్న సంబంధాలను తెంచేందుకు విదేశాల్లో తలదాచుకున్న నేరస్థులను భారత్‌కు రప్పిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. 2019 నుంచి ఇప్పటివరకు 36 దేశాల నుంచి 303 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు వెనక్కి తీసుకొచ్చామని అమిత్ షా వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi