దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చలి పులి..
ఈ శీతాకాలంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా బుధవారం ఉదయం ఉష్ణోగ్రతలు దిగజారాయి.
Heavy cold


న్యూఢిల్లీ, 25 నవంబర్ (హి.స.)

ఢిల్లీ వాసులను చలి గజగజ వణికిస్తోంది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా బుధవారం ఉదయం ఉష్ణోగ్రతలు దిగజారాయి. రాజధాని నగరంలో పాదరస మట్టం 10 డిగ్రీల సెల్సియస్ వద్దకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఇది సాధారణ స్థాయి కంటే 1.3 డిగ్రీలు తక్కువ కాగా, ఒక్క రోజులోనే 1.2 డిగ్రీల మేర పడిపోవడం గమనార్హం.

చలి ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే, మరోవైపు కాలుష్యం కూడా ఢిల్లీ ప్రజలను వదలడం లేదు. రాజధాని వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ సగటున 224 పాయింట్ల వద్ద నిలిచి పూర్ విభాగంలోనే ఉంది. నగరంలోని నాలుగు చోట్ల పరిస్థితి మరింత దిగజారి వెరీ పూర్ స్థాయికి చేరుకుంది.

ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. లోధీ రోడ్డులో 10.1 డిగ్రీలు, అయానగర్ లో 10.4 డిగ్రీలు నమోదు కాగా, పాలం 11 డిగ్రీలు, రిడ్జ్ 11.7 డిగ్రీలతో కాస్త ఎక్కువగా కనిపించాయి. దీంతో చలిగాలులు, కలుషిత వాతావరణం కలిసి ఢిల్లీ ప్రజల దినచర్యను కష్టంగా మార్చేశాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande