ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడుల హెచ్చరిక.. కొనసాగుతున్న హై అలర్ట్
ముంబయి నగరాన్ని ఉగ్రదాడుల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. 2008లో జరిగిన 26/11 తరహాలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడుల హెచ్చరిక.. కొనసాగుతున్న హై అలర్ట్


ముంబయి , 26 నవంబర్ (హి.స.)

ముంబయి నగరాన్ని ఉగ్రదాడుల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. 2008లో జరిగిన 26/11 తరహాలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈ నెల 21న లష్కరే తోయిబా పేరుతో పోలీసులకు వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్ ఈ పరిణామాలకు కారణమైంది.

ఈ-మెయిల్లో కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను లక్ష్యంగా చేసుకుంటామని దుండగులు హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాకుండా సుమారు 300 మందిని హతమారుస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా విభాగాలు రంగంలోకి దిగి అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. రైల్వే స్టేషన్లు, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపు ఈ-మెయిల్ బూటకమై ఉండొచ్చని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande