సౌరవ్ దాస్ విదేశీ పర్యటన అడ్డగింత కేసు: కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సౌరవ్ దాస్ విదేశీ పర్యటన అడ్డగింత కేసు: కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
File


న్యూఢిల్లీ, నవంబర్ 26 (హి.స): యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు వెళ్లకుండా విమానాశ్రయంలో అడ్డుకున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (కేజేపీ) నాయకుడు సౌరవ్ దాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ), ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపిస్తూ, నవంబర్ 22, 23 తేదీల్లో ముంబై పోలీసులు దాస్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారని కోర్టుకు నివేదించారు. దాస్ పాస్‌పోర్ట్‌లో అవకతవకలు గుర్తించామని, అది ఆయన భారత పౌరసత్వంపై ప్రభావం చూపే అంశమని తెలిపారు.

నవంబర్ 23 రాత్రి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లండన్ విమానం ఎక్కేందుకు సిద్ధమైన సౌరవ్ దాస్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన పాస్‌పోర్ట్ వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి ప్రయాణాన్ని నిలిపివేశారు.

ఆక్స్‌ఫర్డ్ యూనియన్ నిర్వహించే ప్యానెల్ చర్చతో పాటు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయాల్లో 'బొద్దింక ఉద్యమం' (కాక్రోచ్ మూవ్‌మెంట్) గురించి ప్రసంగించేందుకు ఆహ్వానం మేరకు తాను యూకే వెళ్తున్నట్లు సౌరవ్ దాస్ తెలిపారు.

మరోవైపు, పాస్‌పోర్ట్ వివరాల వ్యత్యాసాలపై వివరణ కోరుతూ, పాస్‌పోర్ట్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ పాస్‌పోర్ట్ కార్యాలయం నవంబర్ 23న దాస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇందుకు ఏడు రోజుల గడువు ఇస్తూ, వివరణ ఇచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలకు ఆ పాస్‌పోర్ట్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది.

అయితే, తాను విమానం ఎక్కడానికి కేవలం ఐదు గంటల ముందు మాత్రమే ఈ నోటీసు అందిందని సౌరవ్ దాస్ ఆరోపించారు. తన రాజకీయ క్రియాశీలత కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన విదేశీ పర్యటనను అడ్డుకుంటోందని మండిపడ్డారు. గతంలో ఇదే పాస్‌పోర్ట్‌తో ఎలాంటి ఆటంకాలు లేకుండా విదేశాలకు వెళ్లి వచ్చానని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande