భారత ప్రజాస్వామ్యానికి అమూల్యమైన వారసత్వం: రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
భారత ప్రజాస్వామ్యానికి అమూల్యమైన వారసత్వం: రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
PM-MODI-CONSTITUTION-DAY-GREETINGS-INDIAN-DEMOCRACY


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర సందర్భంలో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్‌లోని మహనీయులందరికీ ఆయన ఘన నివాళులు అర్పించారు. గురువారం ‘ఎక్స్’ వేదికగా మోదీ స్పందిస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించిన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి ఒక అమూల్యమైన వారసత్వమని అభివర్ణించారు. వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా రాజ్యాంగం మనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రాజ్యాంగ నిర్మాతలను గౌరవించుకోవడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక విలువలను మరింత బలోపేతం చేసేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటించుకోవడానికి రాజ్యాంగ దినోత్సవం ఒక గొప్ప అవకాశమని ప్రధానమంత్రి తెలిపారు. కోట్లాది మంది భారతీయుల జీవిత ప్రయాణంలో రాజ్యాంగం విడదీయరాని భాగంగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రగతి, సుపరిపాలన, పౌరుల బాధ్యతల విషయంలో రాజ్యాంగ ఆదర్శాలే మనకు ప్రధాన దిశానిర్దేశంగా ఉండాలని మోదీ ఉద్ఘాటించారు.

స్వాతంత్య్ర శతాబ్ది దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో ‘దేశమే ప్రథమం’ అనే భావన, కర్తవ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి సూత్రాలు కీలక పాత్ర పోషించాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. సమష్టి కృషితో దేశాభివృద్ధికి అంకితమవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. దేశ ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ, ఐక్యత మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు సాగాలని రాజ్యాంగ దినోత్సవ వేళ మోదీ ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande