డిసెంబర్ 1 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా బీజేపీ ‘సేవా దూత అభియాన్’.. ఇంటింటికీ మోదీ ప్రభుత్వ విజయాలు
డిసెంబర్ 1 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా బీజేపీ ‘సేవా దూత అభియాన్’.. ఇంటింటికీ మోదీ ప్రభుత్వ విజయాలు
డిసెంబర్ 1 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా బీజేపీ ‘సేవా దూత అభియాన్’.. ఇంటింటికీ మోదీ ప్రభుత్వ విజయాలు


న్యూఢిల్లీ, నవంబర్ 26 (హి.స.)

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25, 2026 వరకు ‘సేవా దూత అభియాన్’ నిర్వహించనుంది. 25 రోజుల పాటు సాగే ఈ దేశవ్యాప్త జనసంపర్క కార్యక్రమం డిసెంబర్ 25న మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా ముగుస్తుంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈ అభియాన్ జాతీయ కన్వీనర్ హరీష్ ద్వివేది నేతృత్వంలో సాగే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడం మరియు అర్హులైన వారందరికీ పథకాల ప్రయోజనాలు అందేలా చూడటం. ఈ ప్రచారం ద్వారా పార్టీ కార్యకర్తలు సామాన్య పౌరులతో నేరుగా సంభాషించి వారి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులను సేకరించి ప్రభుత్వం మరియు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేవా దూతల నియామకం

ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు, ఎంపిక చేసిన కార్యకర్తలకు 25 రోజుల పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిని ‘సేవా దూతలు’ లేదా ‘విస్తారక్‌’లుగా నియమిస్తారు. వీరు సంబంధిత నియోజకవర్గంలోనే ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి సేవా దూత ఒక సంస్థాగత మండలంలో దాదాపు ఐదు రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో గ్రామాలు, పట్టణ వార్డులు, పోలింగ్ కేంద్రాల స్థాయికి వెళ్లి స్థానికులతో మాట్లాడుతారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల స్థితిగతులు, పార్టీ సంస్థాగత బలాన్ని కూడా అంచనా వేస్తారు.

సొంత జిల్లా బయట బాధ్యతలు

ఈ ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పలు రాష్ట్రాల్లో నేతలు, కార్యకర్తలకు వారి సొంత జిల్లాల బయట ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీనివల్ల కార్యకర్తలు స్థానిక పరిస్థితులను స్వతంత్రంగా అంచనా వేయడానికి వీలవుతుంది.

పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన సన్నాహాలు

సేవా దూత అభియాన్‌కు సంబంధించి బీహార్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సంస్థాగత వర్క్‌షాప్‌లు నిర్వహించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమ సన్నాహాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande