
అమరావతి , 28 నవంబర్ (హి.స.)
మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ బిల్లులను అన్ని రాజకీయ పార్టీలు పరస్పర అంగీకారంతో ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుత ప్రాతినిధ్యంలో అన్యాయం జరగదని చంద్రబాబు పేర్కొన్నారు. 1971లో ఒక ఎంపీ సగటున 10 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 27 లక్షలకు చేరిందని వివరించారు. పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరిగితే ఈ భారం తగ్గి, ఒక్కో ప్రజాప్రతినిధి సుమారు 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా ప్రజలకు ఎంపీలు మరింత అందుబాటులో ఉంటారని అభిప్రాయపడ్డారు.
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే అంశానికి మద్దతుగా రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే కేంద్రానికి తీర్మానం పంపినట్లు గుర్తుచేశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని పార్టీలు కలిసి బిల్లులకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలకు కల్పించాల్సిన న్యాయమైన అవకాశాలను అడ్డుకోవద్దని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్