ఎన్నికల విధులకు గైర్హాజరైన 280 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల విధులకు గైర్హాజరైన 280 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు


కృష్ణా జిల్లా, 28 నవంబర్ (హి.స.)కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా విధులు కేటాయించినప్పటికీ కొందరు ఉద్యోగులు విధులకు రాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 280 మంది ఉద్యోగులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఉద్యోగి తనకు కేటాయించిన బాధ్యతలను తప్పనిసరిగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులు ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన బాధ్యత అని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులు (పీవోలు) విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల విధులకు దూరంగా ఉన్న పీవోలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. షోకాజ్ నోటీసులకు ఉద్యోగులు సమాధానం ఇవ్వాలని, వివరణ ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande