
హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)అండాల సేకరణ వ్యవహారంలో పలు ఆస్పత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొన్ని కేంద్రాలు నిబంధనలకు విరుద్ధమైన పద్ధతుల్లో అండాల సేకరణ చేపడుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గత నాలుగు నెలల కాలంలో ఈ వ్యవహారానికి సంబంధించి రూ.400 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసులో ఇంకా అనేక మందిని విచారించాల్సి ఉందని చెప్పారు. సంబంధిత ఆస్పత్రులకు చెందిన 11 మంది డైరెక్టర్ల బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు వివరించారు.
ఈ అక్రమ వ్యవహారంలో అమాయక మహిళలు మోసపోతూ ఇబ్బందులకు గురవుతున్నారని సుమతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఆరోగ్యం, భద్రతను పణంగా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 43 కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? అక్కడ ఏ విధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి? అనే అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్