
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
సివిల్ ఎస్ఐ, సమాన స్థాయి పోస్టుల కోసం నిర్వహించనున్న పీఆర్బీటీ-2026 రాత పరీక్ష నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలక ఆంక్షలు విధించారు.
ఈ నెల 29న పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. అభ్యర్థులు, పరీక్ష సిబ్బంది మినహా ఇతరులు గుంపులుగా ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష సమయంలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అదేవిధంగా పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఫొటోకాపీ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించకుండా సంబంధిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 29న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తెలిపింది. అయితే అంత్యక్రియల ఊరేగింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఉండే ప్రజలు, వ్యాపారులు పోలీసుల ఆదేశాలను పాటించాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు