డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. కేటీఆర్ ప్రకటన
డీలిమిటేషన్ బిల్లుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు.
BRS


హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)

డీలిమిటేషన్ బిల్లుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు దానికి అనుకూలంగా మద్దతు తెలుపుతారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని కేటీఆర్ కోరారు. ముఖ్యంగా జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటరీ ప్రాతినిధ్యం విషయంలో ఎలాంటి అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితి రాకూడదని డిమాండ్ చేశారు.

దేశంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం కల్పించే విధంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత, ప్రయోజనాలను కాపాడటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ అంశాల నేపథ్యంలోనే బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande