
మన్యం జిల్లా, 28 నవంబర్ (హి.స.)
మన్యం జిల్లా భామిని మండలంలో ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది ఆందోళనకు దిగారు. విధుల నిర్వహణ కోసం వచ్చిన తమకు కనీస భోజన సదుపాయాలు కూడా కల్పించలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ఎన్నికల విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది భోజన వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తమ అవసరాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా రోజంతా పనిచేయాల్సి ఉండటంతో కనీస సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.
ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు అన్నారు. భోజన ఏర్పాట్లు వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన కొనసాగించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఎన్నికల సిబ్బంది కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్