
హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు మరింత ప్రాధాన్యం ఇచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఏకంగా 11 నూతన పాలసీలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ వైపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ విధానాలను రూపొందిస్తోంది.
ఇందుకోసం పరిశ్రమలు, ఐటీ, విద్యాశాఖలు సమన్వయంతో పాలసీల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ఇండస్ట్రియల్ పాలసీ 2.0, ఫుట్వేర్ అండ్ లెదర్ పాలసీ, టెక్స్టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ రంగాలకు సంబంధించిన విధానాలను సిద్ధం చేస్తున్నాయి. అలాగే లాజిస్టిక్స్, ఐసీటీ పాలసీ 2.0, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ పాలసీ 2.0 కూడా ఇందులో ఉన్నాయి.
వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాలకు ప్రత్యేక విధానాలను ప్రకటించనున్నారు. విదేశీ ఉన్నత విద్యాసంస్థలు రాష్ట్రంలో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రత్యేక పాలసీని కూడా తీసుకురానున్నారు. ఈ కొత్త విధానాల ద్వారా తెలంగాణను పెట్టుబడులకు, పరిశ్రమలకు, సాంకేతిక రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్