
హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)హైదరాబాద్‌లో సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లోని ఫూలే విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫూలే ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగించి, అణగారిన వర్గాలకు విద్య, సమాన హక్కులు అందించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.
మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ, కుల వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే సాగించిన పోరాటం భారత సామాజిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని నాయకులు గుర్తుచేశారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని ఆయన నమ్మారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు ఘనంగా అంజలి ఘటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్