
హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ సమీపంలోని మణికొండలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి పూజల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో అయ్యప్ప పూజల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు కొందరు యువకులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ప్రమాదంలో ఉదయ్ అనే యువకుడు తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడితో పాటు ఉన్న మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూజల ఏర్పాట్ల సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగ వాతావరణంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో అయ్యప్ప భక్తులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్