
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
గత పదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ములుగు జిల్లాకు సాగునీరు అందలేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రామప్ప నుంచి పాకాల, సిద్ధిపేట, ఘన్పూర్, జనగామ ప్రాంతాలకు నీటిని తరలిస్తున్న నేపథ్యంలో స్థానిక రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా కొత్త ఎత్తిపోతల పథకాలు, కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించి, వాటి మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ములుగు మండలం ఇంచెర్ల గ్రామంలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సౌజన్యంతో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనలకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ యంత్రాలను గ్రామీణ రైతులకు పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. పంటల మార్పిడి, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాలో ఏడాదికి రెండు, మూడు సార్లు రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కొట్లాపురం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.145 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, భూములు కోల్పోయే రైతులతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
లక్నవరం సరస్సు ప్రముఖ పర్యాటక కేంద్రంగానే కాకుండా నాలుగైదు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన వనరుగా ఉందన్నారు. ప్రస్తుతం సరస్సులో నీటి లభ్యత తగ్గిందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయంతో పాటు జాతరల నిర్వహణకు కూడా నీటి కొరత ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ సమస్యకు పరిష్కారంగా సుమారు రూ.35 కోట్లతో రామప్ప-లక్నవరం అనుసంధాన కాలువ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవాదుల ప్రాజెక్టుకు పునాది పడిందని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ద్వారా రామప్ప సరస్సులోకి నీటిని నింపుతున్నట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..