
పెద్దపల్లి, 28 నవంబర్ (హి.స.)
కష్టపడి చదివిన అభ్యర్థులు తమపై తమకు నమ్మకం ఉంచుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల సాధనలో అండగా నిలవాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో 250 మంది అభ్యర్థులకు ఉచిత పోలీస్ శిక్షణ అందించారు. వీరిలో 150 మంది పురుషులు, 100 మంది మహిళలు ఉన్నారు. సుమారు 100 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, యూనిఫామ్ అందించడంతో పాటు నాణ్యమైన శిక్షణ కల్పించారు.
యువతకు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే లక్ష్యాలను సాధించగలరనే నమ్మకంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
రాష్ట్ర పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 29న ఆదివారం నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో ఆయన అభ్యర్థులకు సందేశమిచ్చారు. అభ్యర్థుల ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పురుష, మహిళా అభ్యర్థులతో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 600 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..