రామాయపట్నంలో భారీ రిఫైనరీకి బీపీసీఎల్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) ఏర్పాటు చేసేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆమోదం తెలిపింది.
రామాయపట్నంలో భారీ రిఫైనరీకి బీపీసీఎల్ ఆమోదం


ప్రకాశం, 28 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) ఏర్పాటు చేసేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. సంస్థ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రామాయపట్నంలో రిఫైనరీ ఏర్పాటు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కీలక పరిణామమని లోకేశ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో, ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దక్షిణాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఈ పరిశ్రమ ఒక ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని తెలిపారు.

భారీ పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. రామాయపట్నం ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీపీసీఎల్ ఆమోదంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande