
న్యూఢిల్లీ, 06 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాహదరా జిల్లాలోని శాంతి మొహల్లా, గలీ నంబర్ 6లో ఉన్న ఓ వస్త్ర గోదాములో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటన కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది పలు అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా గోదాములో మంటలు చెలరేగాయని, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలోని పలు భవనాలను వస్త్ర గోదాములుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. గోదాముల్లో ఎవరూ చిక్కుకోలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఆస్తి నష్టం వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని కరోల్‌బాగ్ ఏరియాలోని గఫ్ఫార్ మార్కెట్లో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి పలు మొబైల్ దుకాణాలు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు