
న్యూఢిల్లీ, 06 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రవారం నాటికి నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 387గా నమోదై ‘చాలా పేలవం’ కేటగిరీలోకి వెళ్లిపోయింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత ఇలా దిగజారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలోని పలు కాలుష్య నిఘా కేంద్రాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా రోహిణిలో 473, పంజాబీ బాగ్‌లో 464, ఆర్కే పురంలో 441, అలీపూర్‌లో 435 AQI నమోదై ‘తీవ్రమైన’ (Severe) కేటగిరీలోకి చేరుకుంది. చల్లని గాలులు, తక్కువ వేగంతో వీస్తున్న గాలి కారణంగా ధూళికణాలు, పొగ గాల్లోనే పేరుకుపోతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తుండటంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్లపై దుమ్ము లేవకుండా నిరంతరం నీళ్లు చల్లడం, నిర్మాణ, కూల్చివేత పనులపై కఠిన నిబంధనలు విధించడం, హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు, కట్టెల వాడకంపై నిషేధం విధించడం, కాలుష్య నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు చేపడుతున్నారు.
గాలి నాణ్యత పడిపోయిన నేపథ్యంలో ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు ఉదయం వేళ వాకింగ్, వ్యాయామాలు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఎన్-95 మాస్కులు ధరించాలని స్పష్టం చేస్తున్నారు.
దీపావళి సమయంలో పరిస్థితులు మరింత సవాలుగా మారే అవకాశం ఉండటంతో, కాలుష్య నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..