ఢిల్లీ వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టు సీరియస్
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అమలు చేస్తున్న చర్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme court


న్యూఢిల్లీ, 06 నవంబర్ (హి.స)

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అమలు చేస్తున్న చర్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనాల రాకపోకలపై నిషేధం, నిర్మాణ పనుల నిలిపివేత వంటి చర్యలు పాత, విఫలమైన విధానాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఇవి సమస్య తీవ్రత పెరిగినప్పుడు చేపట్టే తాత్కాలిక ఉపశమన చర్యల వంటివేనని అభిప్రాయపడ్డారు. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్య సంక్షోభంపై దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ వాహనాల నిషేధం, నిర్మాణ కార్యకలాపాల నిలిపివేత వంటి చర్యలు పాతబడిపోయిన, ఆశించిన ఫలితాలను ఇవ్వని విధానాలని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేవని అభిప్రాయపడ్డారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా ఉన్నారు. విచారణ ప్రారంభంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు అమలవుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande