ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్..
ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో బడ్జెట్‌-2026-67ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అయితే, బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
AP CM


హైదరాబాద్, 14 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో బడ్జెట్‌-2026-67ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అయితే, బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌పై స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ట్రాక్ ఎక్కుతోందని అన్నారు.

ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండటం వారసత్వంగా వచ్చిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిస్థితులను మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సిన అవసరం ఉందని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు… మన రాష్ట్రంలో ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు ప్రత్యేక డిమాండ్ ఉందని, వాటి రుచి మరెక్కడా దొరకదని చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని, అప్పుడు రాష్ట్రం పూర్తిగా గాడిలో పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అమరావతి అభివృద్ధిపై కూడా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అమరావతికి స్పష్టమైన రూపు వస్తుందని తెలిపారు. అమరావతి రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని, రాకపోకలు పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. పశ్చిమ బైపాస్ నిర్మాణంతో యాక్సెస్ పెరిగిందని, ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ రోడ్లతో మరింత కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. మొత్తానికి, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సమతుల్యమైన మరియు ముందుచూపుతో రూపొందించిన బడ్జెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande