
నిర్మల్, 14 ఫిబ్రవరి (హి.స.)
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని మాత్రమే సాధించిందని, నైతిక విజయం బీజేపీ దేనని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించిన నిర్మల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 1 సీటుతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 13 సీట్లు కైవసం చేసుకుందన్నారు.
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడు పార్టీలు ఒక్కటై మేక పోతూ గాంభీర్యం ప్రదర్శించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 27 వేల ఓట్లు సాధిస్తే, బీజేపీ 20 వేల 335 ఓట్లు సాధించిందన్నారు. మైనార్టీ ఓటు బ్యాంకుతోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, శనిగరపు చిన్నయ్య, నారాయణ రెడ్డి, కూన శివకుమార్, సాధాం అరవింద్ తో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు