
హైదరాబాద్, 14 ఫిబ్రవరి (హి.స.)
నగరంలోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డాగ్ అడాప్షన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ రేణుక చౌదరి హాజరయ్యారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్కపిల్లను మంత్రి సీతక్క అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఎంపీ రేణుక చౌదరి.. మంత్రి సీతక్క చేతుల మీదుగా కుక్క పిల్లను ఆడాప్ట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ. యజమానులు చనిపోతే ఆవేదనతో మృతి చెందిన కుక్కలు ఉన్నాయని శునకాలపై అనవసరంగా దాడి చేస్తేనే అవి తిరిగి దాడికి పాల్పడతాయని అన్నారు. తన ఇంటి చుట్టూ నిత్యం పదికి పైగా కుక్కలు సంచరిస్తున్న తాను ఎప్పుడూ వాటిని తొలగించాలని ఫిర్యాదు చేయలేదని అన్నారు. కేవలం స్టెరిలైజ్ చేసి వదిలేయాలని సూచించినట్లు తెలిపారు. ఎంతో విశ్వాసంతో మెలిగే శునకం యజమానికి రక్షణగా నిలుస్తుందని అన్నారు. ఇంట్లో కుక్క ఉంటే మనిషితో సమానమని అన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కుక్క పిల్లలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ నగర నడిబొడ్డున జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. స్ట్రే డాగ్ను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారుపేరు కుక్క అని ఆమె అన్నారు. ఇంట్లో ఒక డాగ్ ఉంటే భద్రతా భావం కలుగుతుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని తెలిపారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు