
హైదరాబాద్, 14 ఫిబ్రవరి (హి.స.)
దేశ అభివృద్ధిలో సైన్స్, టెక్నాలజీ,
డేటా, ఇన్నొవేషన్, మ్యాథమెటికల్ థింకింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్మార్ట్ జీనియస్ గ్లోబల్ లెవల్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్, హ్యాండ్ రైటింగ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం రవీంద్రభారతిలో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం నలుమూలల నుంచి 10 వేల మందికి పైగా విద్యార్థులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా పోటీలు విద్యార్థుల్లో గణిత సామర్థ్యం, నైపుణ్యాన్ని పరిశీలించడానికి మాత్రమే కాకుండా, వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. 5 నిమిషాల్లో 35 నుంచి 70 గణితంలో ఉండే సమస్యలను విద్యార్థులు పరిష్కరిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు. అబ్దుల్ కలాంకు గణితంపై ఉన్న ఆసక్తి, క్రమశిక్షణ, ఉన్నత లక్ష్య సాధనపై చేసిన మార్గదర్శకత స్ఫూర్తితో ఈ అవార్డులు ఇవ్వడం గర్వకారణం అని పేర్కొన్నారు.
గణితం అధ్యయనం ఉన్నతమైన ఆలోచనను పెంపొందించి, మనస్సును దృఢపరుస్తుందన్నారు. ప్రాచీన కాలం నుంచే దేశం గణిత శాస్త్రంలో ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం విద్యకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. 2026లో ఇండియా- ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. సంస్థ ఫౌండర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి సుమారు 12000 మంది పిల్లలు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని ఆమె తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు