
కర్ణాటక, 15 ఫిబ్రవరి (హి.స.)
కెమికల్ ట్యాంకర్ మూత తీస్తుండగా
భారీ పేలుడు (Huge explosion) చోటు చేసుకొని ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటకలోని మండ్య తాలూకా కారేకట్టె గ్రామం సమీపంలో ఉన్న 'కీర్తి కెమికల్ ఇండస్ట్రీస్ (Keerthy Chemical Industries) లో చోటు చేసుకుంది. ఒక కెమికల్ స్టోరేజ్ ట్యాంక్ మూతను గ్యాస్ కట్టర్ సహాయంతో తెరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసరాలు దట్టమైన పొగతో నిండిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే భయంతో ఫ్యాక్టరీలోని ఇతర సిబ్బంది, యాజమాన్యం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం మండ్యలోని మిమ్స్ (MIMS) ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్యాస్ కట్టర్ ఉపయోగించినప్పుడు ట్యాంకులోని రసాయనాలు వేడెక్కి ఒత్తిడి పెరగడం వల్లే ఈ పేలుడు సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
మండ్య ఎస్పీ డాక్టర్ శోభారాణి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతులు, గాయపడిన వారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలుగా గుర్తించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా పనులు చేపట్టడమే ఈ మరణాలకు కారణమని పోలీసులు నిర్ధారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..