‘నౌకల పండగ’ వచ్చేసింది
విశాఖ సాగరతీరం విభిన్న నౌకలతో అలలారుతుంది. కొత్త కాంతులను వెదజల్లుతుంది. ఒకటి కాదు... రెండు కాదు... 70కి పైగా యుద్ధ నౌకలు... ధవళ వస్త్రాలతో నేవీ సిబ్బంది చేసే విన్యాసాలు... పది రోజుల పాటు సందడే సందడి.
Fleats


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)భారత నౌకాదళం అరుదుగా నిర్వహించే ‘అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష’ (ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ - ఐఎఫ్‌ఆర్‌)కు విశాఖపట్నం మరోసారి వేదికగా మారింది. దేశంలో ఇప్పటిదాకా రెండుసార్లు ‘ఐఎఫ్‌ఆర్‌’ నిర్వహించగా మొదట ముంబైలో (2001), పదేళ్ల క్రితం విశాఖలో (2016) జరిగింది. దశాబ్దం తరువాత తిరిగి (2026) విశాఖనే ఎంపిక చేయడం విశేషం. ఈ ఉత్సవానికి 50 దేశాల నుంచి నాలుగు వేల మంది అతిథులు, 70కి పైగా యుద్ధనౌకలు వస్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్లకొకసారి భారత నౌకాదళం నిర్వహించే ‘మల్టీ లేటరల్‌ నేవల్‌ ఎక్సర్‌సైజెస్‌ (మిలాన్‌)’ కూడా ఈసారి విశాఖలోనే నిర్వహిస్తున్నారు.

ఇందులో భారతదేశంతో స్నేహసంబంధాలు కలిగిన దేశాలన్నీ పాల్గొంటాయి. ఈ రెండింటితో సరిపెట్టకుండా ముచ్చటగా మూడో కార్యక్రమం ‘ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం’ అదనపు ఆకర్షణ. హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలన్నీ ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నేటి (ఫిబ్రవరి 15) నుంచి మొదలై 25వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పది రోజులు విశాఖ ధవళ వస్త్రధారులతో ధగధగా మెరిసిపోతుంది.

భారత రాష్ట్రపతి తన పదవీ కాలంలో కనీసం ఒకసారి నౌకాదళ సమీక్ష చేస్తారు. దీన్ని ‘ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ’ (పీఎఫ్‌ఆర్‌)గా వ్యవహరిస్తారు. యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, కోస్టుగార్డు నౌకలు పాల్గొంటాయి. శక్తిసామర్థ్యాలు ప్రదర్శిస్తాయి. భారత నౌకాదళం సత్తాను ప్రపంచానికి చాటుతాయి. ఈ సమీక్షకు అప్పుడప్పుడు మిత్ర దేశాలను కూడా ఆహ్వానించి, వారి యుద్ధనౌకలతో కలిసి విన్యాసాలు చేస్తారు. దీనిని ‘ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ’గా వ్యవహరిస్తారు. ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో నిర్వహించేది కూడా అదే. ఈ కార్యక్రమానికి ఈసారి 50 దేశాల వరకు హాజరవుతాయంటున్నారు. ‘మిలాన్‌’కు 1995లో శ్రీకారం చుట్టారు.

అక్కడి నుంచి క్రమం తప్పకుండా రెండేళ్లకొక సారి దీనిని అండమాన్‌లో నిర్వహిస్తున్నారు. 2014లో అత్యధికంగా 17 దేశాలు పాల్గొన్నాయి. అనేక దేశాలు ఆసక్తి చూపడం, అండమాన్‌లో సరిపడా మౌలిక వసతులు లేకపోవడంతో వేదికను విశాఖపట్నానికి మార్చారు. 2020లో కొవిడ్‌ కారణంగా వాయిదా వేసి, 2022 ఫిబ్రవరిలో, ఆ తరువాత 2024లో నిర్వహించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విశాఖ వేదికగా ఈ వేడుక జరుగుతోంది. మిత్రబంధం బలోపేతం, పరస్పర సహకారం, కలిసి పనిచేయడం అనే మూడు లక్ష్యాలతో ఈసారి ‘మిలాన్‌’ నిర్వహిస్తున్నారు. మన యుద్ధ నౌకలు, నేవీ సామర్థ్యంతో పాటు వివిధ దేశాల నౌకలను దగ్గరి నుంచి చూసే అవకాశం ఈ వేడుక ద్వారా అందరికీ దక్కుతోందంటే విశేషమే కదా.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande